ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో అక్రమ ప్లాట్ల విక్రయాలకు పాల్పడిన కేసులో నలుగురు కీలక నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. టౌన్ ఏసీపీ రమణమూర్తి సోమవారం ఖానాపురం హావేలి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరాలు వెల్లడించారు.
అక్రమ ప్లాట్ల విక్రయాల కేసులో కల్తీ రామచంద్రయ్య, బాణాల లక్ష్మణచారి, చిప్పనపల్లి వీరయ్య, కుంజా కృష్ణయ్యను అరెస్ట్ చేశామన్నారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రధాన నిందితులైన పోలేబొయిన ముత్తయ్య, బల్లి శ్రీనివాస్, కొప్పెర వెంకన్న, కొట్టే బసు, సంపంగి వెంకటచలంలను పోలీస్ కస్టడీలో విచారించి తిరిగి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. మొత్తం ఇప్పటివరకు 16 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నిందితుల అక్రమ ఆస్తులను గుర్తించి చట్ట ప్రకారం స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.
